Search This Blog

Sunday, August 26, 2018

'MAANDI'వెరైటీ బిర్యానీ.. ఇప్పుడిదొక ట్రెండ్


మారుతున్న ఆహార అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులఉ సరికొత్త రుచులు, కొంగొత్త సంప్రదాయాలను ప్రవేశపెడుతున్నారు. వెరైటీ డిష్‌లను తయారుచేస్తూ భోజనప్రియులను ఆకర్షిస్తున్నారు. అలాంటి వెరైటీ డిష్‌లలో ‘మండీ’ బిర్యానీ స్పెషల్‌. ఇప్పుడు విజయవాడ, గుంటూరు నగరాల్లో ఇదొక ట్రెండ్‌. కుటుంబ సమేతంగా, స్నేహితులు ఈ డిష్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. బర్త్‌డేలు, మ్యారేజ్‌ డేలు, వీకెండ్‌ పార్టీలు, ఫ్యామిలీ పార్టీలు, ఇతర ఆనంద సమయాల్లో మండీ బిర్యానీ స్పెషల్‌ డిష్‌గా సెలక్ట్‌ చేసుకుంటున్నారు.

నయా టేస్ట్‌

విభిన్న సంస్కృతులు రాజధానికి తరలివస్తున్న నేపథ్యంలో విజయవాడ, గుంటూరు నగరాలు నయా రూపం సంతరించుకుంటున్నాయి. ఆ ప్రభావం స్థానికుల జీవన విధానంపై కూడా పడుతుండటంతో రాజధాని నగరాల్లోని ప్రజల జీవనశైలి మారిపోతోంది. కొత్త సంప్రదాయాలకు స్వాగతం పలుకుతున్నారు. ఈ క్రమంలో ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయి. రాజధానిలో పనిచేసే ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులు కావడంతో అనేక మంది వీకెండ్‌ పార్టీలు చేసుకోవడం.. ఎక్కువమంది ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి సెలవుల్లో బయటకు వెళ్లి తమకు ఇష్టమైన బిర్యానీలు తినడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రజల అభిరుచులకు అనుగుణంగా నగరంలో రకరకాల రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. వాటి నిర్వాహకులు కొత్తకొత్త వెరైటీ డిష్‌లతో ఆకట్టుకుంటున్నారు. వాటిలో మండీ స్పెషల్‌ బిర్యానీ ఇప్పుడు హాట్‌ టాపిక్‌.

ఒకే కంచంలో కలిసిమెలిసి..

సాధారణంగా మనం భోజనం చేయడానికి హోటల్‌కు వెళ్తే డైనింగ్‌ టేబుల్స్‌పైనే వడ్డిస్తారు. స్టార్‌ హోటళ్లు మొదలు చిన్నచిన్న రెస్టారెంట్ల వరకు ఎక్కడకు వెళ్లినా ఇదే పరిస్థితి. ఎవరికిష్టమైన ఆహారాన్ని వారు ఆర్డర్‌ చేసుకుని ఎవరి ప్లేటులో వారు తినడం చూశాం. కానీ, మండీ బిర్యానీ ఇందుకు పూర్తి భిన్నం. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు వెళితే.. అందరికీ కలిపి ఒక ఎత్తుపీటపై ఒకే కంచంలో చికెన్‌, మటన్‌తో చేసిన బిర్యానీ వడ్డిస్తారు. ఆ కంచం చుట్టూ కూర్చుని కలిసి తినడమే దీని ప్రత్యేకత. ఒకరు.. ఇద్దరు.. ముగ్గురు.. నలుగురు.. ఇలా మనుషుల సంఖ్య పెరిగేకొద్దీ కంచం సైజు కూడా పెరుగుతుంది. గరిష్టంగా ఐదుగురు కలిసి ఒకే కంచంలో తినేందుకు వీలుగా రెస్టారెంట్ల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

బిర్యానీ పార్టీలు చేసుకునేవారు ఎక్కువ సంఖ్యలో వెళితే అందుకనుగుణంగా ఏర్పాట్లుంటాయి. ఆహ్లాదకర వాతావరణంలో మంచి సంగీతాన్ని ఆస్వాదిస్తూ.. అందరూ కలిసి కూర్చుని ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ.. ఇష్టమైన బిర్యానీ తింటూ మధురానుభూతిని పొందుతున్నారు. కాలేజీ ఫ్రెండ్స్‌ అయితే.. మండి బిర్యానీ డిష్‌ను అమితంగా ఇష్టపడుతున్నారు. ఏడాదిన్నర క్రితం విజయవాడలోని టిక్కిల్‌ రోడ్డులో ఏర్పాటుచేసిన బార్కాస్‌ రెస్టారెంట్‌ నిర్వాహకులు తొలిసారిగా ఈ మండీ బిర్యానీ డిష్‌ను నగరవాసులకు పరిచయం చేశారు. క్రమంగా ఇది క్రేజీగా మారడంతో విజయవాడ, గుంటూరు నగరాల్లో పలుచోట్ల కొత్తగా వెలిశాయి.

తయారీ ఇలా..

హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీ, ఇతర బిర్యానీలకు పూర్తి భిన్నంగా మండీ బిర్యానీని తయారు చేస్తారు. బొగ్గుల పొయ్యి మీద చికెన్‌ (కోడి తొడ)ను వెన్నతో కాలుస్తూ రోస్ట్‌ చేస్తారు. బొగ్గులపై కాల్చడం వల్ల దాని రుచే వేరుగా ఉంటుంది. కాజు పేస్ట్‌తో మటన్‌ను కూడా అంతే ప్రత్యేకంగా తయారుచేస్తారు. బాసుమతి బియ్యంతో విడిగా బిర్యానీని తయారుచేస్తారు. దీని తయారీలోనూ ఎలాంటి నూనెలు వినియోగించరు. ప్రత్యేకంగా చేసిన మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలతో చేసిన మండీ బిర్యానీ టేస్టే వేరు. ఇలా విడివిడిగా చేసిన బిర్యానీ, చికెన్‌, మటన్‌, ప్లేటులో పెట్టి.. సన్నగా తరిగిన కీరా, క్యారెట్‌, ఆనియన్‌ స్లైస్‌ అలంకరించి అందిస్తారు. ఈ బిర్యానీని తింటున్నప్పుడు చేతికి అంటుకోదు. అందరూ కలిసి తినడం వల్ల ఆహార పదార్థాల వృథా తగ్గుతుంది. ఆత్మీయులతో కలిసి తిన్నామన్న సంతృప్తి మిగులుతుందని బిర్యానీ ప్రియులు చెబుతున్నారు. ధరలు కూడా అందుబాటులోనే ఉన్నాయని చెబుతున్నారు. రెస్టారెంట్లకు వెళ్లి మండీ బిర్యానీ తినలేని వారికి డోర్‌ డెలివరీ, ఆన్‌లైన్‌ బుకింగ్‌ సౌకర్యాలు కూడా ఉన్నాయి.

అరబిక్‌ సంప్రదాయమే..

‘మండీ’ అరబిక్‌ పదం. అందరూ కలిసి ఒకే కంచంలో తినడం అరబిక్‌ సంప్రదాయం. యెమన్‌, సౌదీ అరేబియా, ఒమన్‌, సోమాలియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ తదితర ప్రాంతాల్లో ఈ సంప్రదాయం ఉంది. క్రమంగా అన్ని ప్రాంతాలకూ ఇది విస్తరిస్తోంది. నవ్యాంధ్రలోనూ మండీ బిర్యానీ పాపులర్‌ అయ్యింది. అరబ్‌లో ఎక్కువగా మటన్‌తో మండీ బిర్యానీ తయారుచేస్తారు. ఇక్కడ మటన్‌, చికెన్‌తో కూడా తయారు చేస్తున్నారు.

No comments:

Post a Comment

How to use kaiber ai free ! Kaiber ai free me use kaise kare

How to use kaiber ai free ! Kaiber ai free me use kaise kare https://www.youtube.com/watch?v=IFPOvlfBhaw